Tuesday, 7 July 2015

బిక్కవోలు

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి రాద్దామని ఈ టపా ప్రారంభిస్తున్నాను.
 పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో  రోజు టపాగా

బిక్కవోలు
సామర్లకోటకి 15 కి.మీ. దూరములో బిక్కవోలు ఉంది. ఈశ్వరుని కుటుంబము కొలువు తీరిన గ్రామము.

గోలింగేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడురాజేశ్వరుడు, భారీ లక్ష్మీగణపతి ఆలయము ఈ గ్రామము లో ఉన్నాయి.  ఈ గణపతి  మన కోర్కెలను ఇట్టే తీర్చేస్తాడు. స్వామికి గరికతో పూజ చేసి స్వామి విగ్రహం దగ్గిరకి వెళ్ళి ఆయన ఎడమ చెవిలో మన కోరిక చెప్పాలి.  కోరిక తీరిన తరువాత వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవాలి.ఈ గనపతి విగ్రహం రోజు రోజు కి పెరుగు తోంది అందుకే ఇదివరలో చేయించిన కవచము సరిపోవడం లేదు అని అర్చకులు చెబుతున్నారు. (9948754824 ఇది ఒక అర్చకుల ఫోన్ నంబరు వివరములకు వీరిని సంప్రదించండి.శివాలయాలు ప్రసిద్ధిగాంచిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము ఉన్నాయి. అన్నీ అతి పురాతనమైనవి. చూడ తగినవి.

Monday, 6 July 2015

పుష్కర ఆహ్వానపత్రిక

శ్రీరస్తు                                                      శుభమస్తు                              అవిఘ్నమస్తు
పుష్కర ఆహ్వానపత్రిక

పవిత్ర గోదావరి నది మహాపుష్కరాల సందర్భముగా బంధువులందరికీ, స్నేహితులకి, వారి వారి బంధువులు స్నేహితులకి ఇదే మా ఆహ్వానము.
               మహాపుష్కర సందర్భముగా పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి తదితర పూజ కార్యక్రమములను నిర్వహించుకోవలెను. కనుక మీరు అందరూ జూలై 14 నుండి 25 వ తారీఖు వరకూ ఇక్కడ ఉండే విధముగా మీరు వచ్చి పవిత్ర స్నానములను ఆచరించి మీరు పుణ్యము గైకొని మీకు ఆతిధ్యమిచ్చిన మమ్ములను ఆనందింపచేసి తరింప చేయగోర్తాము.
            మీరు అందరూ తప్పక విచ్చేసి మా ఆతిధ్యము స్వీకరించి మమ్ములను ఆనందింపచేయగోర్తాము.
                                                                                                                           ఇట్లు

                                                                                                                  ప్రభాకరరావు, లలిత

వేదంలా గోదావరి ప్రవహిస్తోందే...

వేదంలా గోదావరి ప్రవహిస్తోందే...
వేదంలా గోదావరి ప్రవహిస్తోందే... ఘంటసాల వారి ప్రైవేట్ సాంగ్. ఆకాశవాణిలో ఎక్కువగా మారోజుల్లో వినపడేది.

ఎనిమిది సోమేశ్వరాలయములు

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో  రోజు టపాగా
ద్రాక్షారామమునకు ఎనిమిది దిక్కులా ఎనిమిది సోమేశ్వర ఆలయములు ఉన్నాయి. వరుస క్రమములో వాటిని ఈ క్రింద చూపించడము జరిగింది. అవి కూడా దర్శనీయములే.
తూర్పు..          కోలంక
ఆగ్నేయము      దంగేరు
దక్షిణము..         కోటిపల్లి
నైఋతి……       కోరుమిల్లి
పడమర..          కుండలేశ్వరం
వాయువ్యము..  వెల్ల
ఉత్తరము..         చొల్లంగి.

ఈశాన్యము..      పలివెల (కొప్పులింగేశ్వరుడు)

Sunday, 5 July 2015

గోదావరి

పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో  రోజు టపాగా
గోదావరి
మహారాష్ట్రలోని నాశికాత్రయంబకము వద్ద పుట్టిన గోదావరి తన నడకలలో పూర్ణ, ప్రవర, ఇంద్రావతి, మంజీర, బిందుసార, శబరి ఇంకా ఎన్నో  అనేక ఉప నదులను కలుపుకుంటూ ఆంఢ్రదేశములో ప్రవేశించి ధవళేశ్వరం వద్ద 7 పాయలై సప్త గోదావరియై చిట్ట చివర బంగాళాఖాతములో కలిసిపోతుంది. సప్త ఋషులు ఈ గోదావరిని తీసుకొచ్చారు గనుక అది వారి వారి పేరు మీద 7 పాయలయ్యింది అంటారు. అవి.. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ,కశ్యప, తుల్య  ఇందులో అన్నీ ప్రవహించే నదులు కావు. కొన్ని అంతర్వాహినులు. అవి ఆత్రేయ, భరద్వాజ, తుల్య, కశ్యప.. వశిష్థ గౌతమితో కలిసే ఉంటుంది. ఈ సప్త గోదావరులూ అంతర్వాహినిగా ప్రవహించి ద్రాక్షారామము వద్దగల కోనేటిలో దర్శనమిస్తాయి అని అక్కడ ఉన్న పుష్కరిణికి సప్త గోదావరి అని పేరు. చిట్ట చివర గోదావరి ఒక పాయ కోటిపల్లి మీదుగా ప్రవహించి యానం వద్ద బంగాళాఖాతములో కలుస్తుంది. అలాగే ఇంకొక పాయ గౌతమి వశిష్ఠతో కలిసి అంతర్వేది వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. . ఈ సప్త గోదావరులలో స్నానం చేసిన ఫలితాన్ని పొందాలి అనుకుంటే ద్రాక్షారామము లోని పుష్కరిణిలో చేస్తే వస్తుంది అని అక్కడి స్థల పురాణము. పుష్కర సమయములో అనగా ఆ పన్నెండు రోజులు ఏ పుణ్య కార్యము చేసినా అది అనంతమైనదని పెద్దలు చెబుతారు. పుస్కరుడు జలములందు ఉండగా నదీ స్నానము చేస్తే సర్వ పాపములు పోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని సనాతన ధర్మమునందు విశ్వాసమున్న ప్రతివారు నమ్ముతారు. అదేవిధముగా గోదావరి నదికి గల అంత్య పుష్కరాలలోనూ చెయ్యాలి అని పెద్దల ఉవాచ. గోదావరి.. గోదావరి నదీ తీరము తలుచుకోగానే జ్ఞాపకం వచ్చేవి ఒకటి భద్రాచలము రెండు రాజమండ్రి.భస్రాస్రి లో జరిగే శ్రీ సీతారాముల కల్యాణము జత్ ప్రసిద్ధి పొందింది. రాజరాజనరేంద్రుడి పాలనలో నిర్మింపబడిన నగరము ఆయన పేరు మీద రాజమహేంద్రపురము ప్రస్థుత రాజమండ్రిగా ఉన్నాయి. రాజమండ్రి అనగానే గోదావరి నది, ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్ దొర. ఇంకా వెనక్కి వెళ్తే తెలుగునాట ప్రతి ఇంటిలోనూ రోజులో ఏదో ఒక సమయములో ఉచ్చరింపబడే మాట మహాభారతము. రాజరాజమరేంద్రుడి కోరిక మీదనే కవిత్రయములో మొదటివాడు నన్నయభట్టారకుడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. ఆ ఆదికవి పేరు మీద నన్నయ యూనివర్శిటీ రాజమండ్రిలో ప్రారంభమయ్యింది. 
ఇంక ప్రస్థుత జీవితములో ఒక భాగముగా కలిసిపోయి మనము మమేకమౌతున్న సినిమాలు.  గోదావరి అనగానే సినిమాలలో, మూగమనసులు, అందాలరాముడు, సాక్షి గుర్తుకొస్తాయి. వాటిలో గోదావరి అంత బాగా చిత్రీకరింపబడటమేకాదు ఆ సినిమాలలో ఒక పాత్ర అయింది అనే చెప్పాలి. గోదావరి గురించి ఆ తీరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  సామాజిక పరముగా ఆనాడు సంఘంలో ఉన్న దురాచారాలని రూపుమాపాలని కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చిలకమర్తి ఇంకా ఎందరో మహానుభావులు... ఇలా గోదావరి-సాహిత్యము, గోదావరి-సాంఘిక సంస్కరణలు, గోదావరి--రాజకీయాలు, గోదావరి-సినిమాలు, గోదావరి-కళాకారులు అంటూ రాసుకుంటూ పోతే...???..  ఇక్కడితో ఆపేస్తాను ఈనాటికి.

Saturday, 4 July 2015

మరో భద్రాద్రి.... గొల్లలమామిడాడ

 పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో రోజు టపాగా
మరో భద్రాద్రి

గొల్లలమామిడాడ
శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అయోధ్య లో అవతరించి, లోక కళ్యాణార్థం దుష్టశిక్షణ గావించారు .శ్రీరాముని అవతారం ఎందరికో ఆదర్శవంతం అయ్యింది. కలియుగం లో భద్రాచల రాముడిగా అవతరించాడు. తన ఉనికి కంచర్ల గోపన్న ద్వారా నేటికి ప్రాశస్థమై ఉంది. భద్రాచలం తర్వాత మరో భద్రాద్రి గా తూర్పు గోదావరి జిల్లాలో  పిలవబడుతున్న క్షేత్రము గొల్లల మాడిడాడ  శ్రీకోదండరామాలయము..
తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడ రాజమండ్రికి 60కి.మీ, కాకినాడ నగరానికి 21 కి.మీ దూరములో ఉంది. జిల్లా నడిబొడ్డులో ప్రకృతి రమణీయాల నడుమ నిర్మితమైన క్షేత్రం అనేక విశిష్టతలను కలిగి ఉంది. రామలయ నిర్మాణము ఎంతో అందంగా ఉండటమే గాక ఎంతో శిల్పకళా నైపుణ్యం దాగి ఉంది. దివ్య క్షేత్రం బిక్కవోలు గ్రామానికి 4 కి. మి. దూరం లో, అమలాపురాని కి(వయా కోటిపల్లి) సుమారు 65 కి.మి. దూరం లో ఉంది.
గౌతమీ నది లోని పాయను సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షి తన వెంట తీసుకుని వెళ్ళాడు. పాయ మిగితా మహర్షులు తరలించిన నదీ పాయలన్నింటి సమ్మేళనంగా వాటి తుల్యంగా ఖ్యాతిగాంచింది అందుకే పాయకు తుల్య అని పేరు. తుల్యా నదీ తీరాన వెలసిన క్షేత్రం గొల్లలమామిడాడ.   నదీ తీరాన మామిడి చెట్లు అధికంగా ఉం డి  శిద్ధపురుషుల స్నాన పాన ధ్యాన తపస్సులకు అనువుగా ఉండేది. అందుకే దీనిని మామిడి వాటిక గా మామిడి వాడ గా వ్యవహరించేవారు. వ్యవహారికం లో మామిడి వాడ గాను అనంతరం మామిడాడ ( ప్రస్థుత వాడుక లో ఉంది) అయ్యింది. తదనంతరం యాదవుల నివాసస్థలి గా మారడంతో గ్రామం గొల్లలమామిడాడ అయ్యిందని చెబుతారు.
ఆలయం క్రీ..1889 లో మొదటిగా శ్రీ విష్ణుమూర్తి స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పగా ద్వారంరెడ్డి, సుబ్బిరెడ్డి, అన్నదమ్ముల ఇరువురు తమ స్వంత ఆస్థులను విక్రయించి నిర్మించిన దేవాలయం ఇది. సుమారు కొన్ని ఎకరాల విస్తీర్ణం లో సువిశాల మైన లోగిలో అలరారుతూ ఉన్న క్షేత్రంలో శ్రీ రాముడు ఇక్కడ భక్తులకు సీతా నమేత శ్రీ కోదండ రాముడి గా దర్శనమిస్తాడు.
        ఆలయం వెలుపల చాలా పెద్ద ఎత్తు కలిగిన తూర్పు, పశ్చిమ మహారజ గోపురాలు కలిగి ఉండటం ఆలయ ప్రత్యేకత. 1948 సంవత్సరం లో సుమారు 160 అడుగుల ఎత్తు 9 అంతస్థులు పంచకలశ సముఖంతో తూర్పు గోపురం నిర్మితమైంది. 1958 సంవత్సరం లో సుమారు 210 అడుగుల ఎత్తు 11 అంతస్థులు పంచకలశాల తో పశ్చిమ గోపురం నిర్మితమైంది. క్షేత్రం చుసి తరించిన వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చెప్పటానికి సాధ్యం కాదు. ఇక్కడి గోపురాలు, అద్దాల మేడ, ద్వజస్థంభం, శిల్ప కళా నైపుణ్యం, ఇక్కడ దేవతల విగ్రహాలు అందర్నీ ముగ్ధుల్ని చేస్తాయి.
        తెలంగాణా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద రామాలయం భద్రాచలం. దాని తర్వాత పేరు ప్రఖ్యాతలు గాంచిన మరో దేవాలయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గల గొల్లలమాడిడాడ శ్రీ కోదండ రామ స్వామి ఆలయం.
ఈ కోదండ రామాలయముతో పాటుగా ఇక్కడ చూడవలసిన్ ఇంకొక ముఖ్య దేవాలయము సూర్య దేవాలయము. దీనిని గురించి మరి ఇంకొక టపాలో తెలియ చేస్తాను.

పైన చెప్పిన విషయములు కొన్ని చూసి తెలుసుకున్నవి మరికొన్ని అంతర్జాలము నుండి సేకరించినవి చిత్రములు కూడా అంతర్జాలమునుండి దిగుమతి చేసుకున్నవి అని గమనించ కోరుతాను