Saturday, 4 July 2015

మరో భద్రాద్రి.... గొల్లలమామిడాడ

 పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి  పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము గురించి పవిత్ర గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో రోజు టపాగా
మరో భద్రాద్రి

గొల్లలమామిడాడ
శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అయోధ్య లో అవతరించి, లోక కళ్యాణార్థం దుష్టశిక్షణ గావించారు .శ్రీరాముని అవతారం ఎందరికో ఆదర్శవంతం అయ్యింది. కలియుగం లో భద్రాచల రాముడిగా అవతరించాడు. తన ఉనికి కంచర్ల గోపన్న ద్వారా నేటికి ప్రాశస్థమై ఉంది. భద్రాచలం తర్వాత మరో భద్రాద్రి గా తూర్పు గోదావరి జిల్లాలో  పిలవబడుతున్న క్షేత్రము గొల్లల మాడిడాడ  శ్రీకోదండరామాలయము..
తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడ రాజమండ్రికి 60కి.మీ, కాకినాడ నగరానికి 21 కి.మీ దూరములో ఉంది. జిల్లా నడిబొడ్డులో ప్రకృతి రమణీయాల నడుమ నిర్మితమైన క్షేత్రం అనేక విశిష్టతలను కలిగి ఉంది. రామలయ నిర్మాణము ఎంతో అందంగా ఉండటమే గాక ఎంతో శిల్పకళా నైపుణ్యం దాగి ఉంది. దివ్య క్షేత్రం బిక్కవోలు గ్రామానికి 4 కి. మి. దూరం లో, అమలాపురాని కి(వయా కోటిపల్లి) సుమారు 65 కి.మి. దూరం లో ఉంది.
గౌతమీ నది లోని పాయను సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షి తన వెంట తీసుకుని వెళ్ళాడు. పాయ మిగితా మహర్షులు తరలించిన నదీ పాయలన్నింటి సమ్మేళనంగా వాటి తుల్యంగా ఖ్యాతిగాంచింది అందుకే పాయకు తుల్య అని పేరు. తుల్యా నదీ తీరాన వెలసిన క్షేత్రం గొల్లలమామిడాడ.   నదీ తీరాన మామిడి చెట్లు అధికంగా ఉం డి  శిద్ధపురుషుల స్నాన పాన ధ్యాన తపస్సులకు అనువుగా ఉండేది. అందుకే దీనిని మామిడి వాటిక గా మామిడి వాడ గా వ్యవహరించేవారు. వ్యవహారికం లో మామిడి వాడ గాను అనంతరం మామిడాడ ( ప్రస్థుత వాడుక లో ఉంది) అయ్యింది. తదనంతరం యాదవుల నివాసస్థలి గా మారడంతో గ్రామం గొల్లలమామిడాడ అయ్యిందని చెబుతారు.
ఆలయం క్రీ..1889 లో మొదటిగా శ్రీ విష్ణుమూర్తి స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పగా ద్వారంరెడ్డి, సుబ్బిరెడ్డి, అన్నదమ్ముల ఇరువురు తమ స్వంత ఆస్థులను విక్రయించి నిర్మించిన దేవాలయం ఇది. సుమారు కొన్ని ఎకరాల విస్తీర్ణం లో సువిశాల మైన లోగిలో అలరారుతూ ఉన్న క్షేత్రంలో శ్రీ రాముడు ఇక్కడ భక్తులకు సీతా నమేత శ్రీ కోదండ రాముడి గా దర్శనమిస్తాడు.
        ఆలయం వెలుపల చాలా పెద్ద ఎత్తు కలిగిన తూర్పు, పశ్చిమ మహారజ గోపురాలు కలిగి ఉండటం ఆలయ ప్రత్యేకత. 1948 సంవత్సరం లో సుమారు 160 అడుగుల ఎత్తు 9 అంతస్థులు పంచకలశ సముఖంతో తూర్పు గోపురం నిర్మితమైంది. 1958 సంవత్సరం లో సుమారు 210 అడుగుల ఎత్తు 11 అంతస్థులు పంచకలశాల తో పశ్చిమ గోపురం నిర్మితమైంది. క్షేత్రం చుసి తరించిన వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చెప్పటానికి సాధ్యం కాదు. ఇక్కడి గోపురాలు, అద్దాల మేడ, ద్వజస్థంభం, శిల్ప కళా నైపుణ్యం, ఇక్కడ దేవతల విగ్రహాలు అందర్నీ ముగ్ధుల్ని చేస్తాయి.
        తెలంగాణా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద రామాలయం భద్రాచలం. దాని తర్వాత పేరు ప్రఖ్యాతలు గాంచిన మరో దేవాలయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గల గొల్లలమాడిడాడ శ్రీ కోదండ రామ స్వామి ఆలయం.
ఈ కోదండ రామాలయముతో పాటుగా ఇక్కడ చూడవలసిన్ ఇంకొక ముఖ్య దేవాలయము సూర్య దేవాలయము. దీనిని గురించి మరి ఇంకొక టపాలో తెలియ చేస్తాను.

పైన చెప్పిన విషయములు కొన్ని చూసి తెలుసుకున్నవి మరికొన్ని అంతర్జాలము నుండి సేకరించినవి చిత్రములు కూడా అంతర్జాలమునుండి దిగుమతి చేసుకున్నవి అని గమనించ కోరుతాను

1 comment: