Wednesday, 19 October 2016

నెగటివ్ ఎనర్జీ మీ* *ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎం చేయాలో చూడండి.

               *మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే ఇవి పాటించండి!!*
ప్రతీ ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలనే అనుకుంటారు. తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్య, పిల్లలు.... ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు. అంతా బానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమైఉండచ్చు. మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమైఉండచ్చు.
       *ఇలాంటి నెగటివ్ ఎనర్జీ మీ* *ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎం చేయాలో చూడండి..!*
*ముందు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందనడానికి కారణాలు చూడండి:*
* ఇంట్లోవారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
* అన్నిటికి తప్పు బడుతున్నారా? మీ ఇంట్లోవారు ఏ పని చేసిన అందులో తప్పులు వెతకడం.. లేదా మీ పై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
*ఒకే ఇంట్లోఉన్న అన్నతమ్ములని తండ్రి కొడుకులని విడగొట్టడం వలనకూడా నెగిటివ్ ఎనర్జి ఉన్నట్లే.
* తరచుగా ఎవరో ఒకరిపై చిన్న చిన్న వాటికి కంప్లైంట్ చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
*మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నిండడానికి కారణాలు ఏంటో చూడండి:*
* ఇంట్లో వస్తువులు గాని, బట్టలు గాని ఎలాపడితే అల వదిలేయకూడదు. వాటిని సక్రమంగా అమర్చుకోవాలి. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
*ఇంటిముందు ప్రతీనిత్యం మంచివి పెద్దముగ్గులను వేయాలి చెత్తచెదారాలను ఎక్కడబడితే అక్కడ వేయరాదు ఒకవేళ అలాచేస్తే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే.
* మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయండి. చేతులో పట్టుకొని అటు ఇటు తిరిగితే నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
* మురికి బట్టలు ధరించకూడదు. వీటివల్ల క్రిములు రావడమే కాకుండా వస్తు ప్రకారం ఈ బట్టలు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
* ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురుబొదురుగా అస్సలు ఉంచకూడదు. వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగా ఉంచాలి. పక్కపక్కన పెట్టచ్చు గాని ఎదురుబొదురుగా పెడితే నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
*నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమికోట్టాలో చూడండి:*
* ఓ గుప్పెడు రాయిఉప్పు లేదా దొడ్డుఉప్పుని అన్ని రూమ్ మూలలలో పెట్టండి. 48 గంటల తరువాత దాన్ని తీసేయండి. నెగటివ్ ఎనర్జీ తరిమికొట్టడంలో రాయిఉప్పు బాగా పనిచేస్తుంది. కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కలపండి.
* ఇంటిని, ఇంట్లో వస్తువులని పైపైన దులపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్.. ఇలా అన్నిటిని కనీసం రెండు వారాలకొకసారైనా శుభ్రపరుచుకోండి.
* పాత పుస్తకాలు, దుస్తులు లాంటివి ఉంచుకోకండి. కుదిరితే ఎవరికైనా దానం చేయండి. ఎంత తక్కువ వస్తువులు ఉంటె అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
* నిశాభ్ధంగా ఉంటె చాలా మందికి నచ్చుతుంది. కాని అప్పుడప్పుడు ఫుల్ సౌండ్ తో పాటలు వినడం లేదా సినిమా చూడడం లాంటివి చేస్తే నెగటివ్ ఎనర్జీ అక్కడనుండి పారిపోతుంది.
* తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఈగలొస్తాయి. దోమలోస్తాయి అని అలా చేయకుండా ఉండకండి. ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
* మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరమే కాదు... మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. దీంతో మీ ఇంటి పై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇంట్లో ఏదైనా సూర్య కాంతి పడే మంచి స్థలం చూసుకొని అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది.
* ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ కాండిల్స్ వెలిగిస్తూ ఉండాలి. ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది.
* మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎల్లపుడు ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటకి మార్చండి. సోఫాల పైన ఉన్న క్లాత్ ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
* హాల్ లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇల్లంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంట్లో చెట్లని చూస్తే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి.
* ఇంట్లో అక్కడక్క వెల్లులి రెమ్మలను తగిలించండి. ముఖ్యంగా మెయిన్ డోర్ కి తగిలిస్తే ఆత్మలు, దెయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయి.
* క్రిస్టల్స్ ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడతీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి.
Curtesy. Mani

Tuesday, 18 October 2016

దసరా

                 ఏ పండుగ అయినా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ అమ్మవారి పండుగ సంవత్సరానికి రెండుమార్లు వస్తుంది. ఎలాగ అంటే, ----చైత్రమాసంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంతనవరాత్రులు ఒకసారి...... ఆశ్వీయుజ మాసంలో పాడ్యమి నుండి విజయదశమి వరకు శరన్నవరాత్రులు మరొకసారి ..... జరుగుతాయి.
          మాసాల్లో మొదటిది చైత్రమాసం, నక్షత్రాలలో మొదటిది అశ్విని. చైత్రమాసంలో నవరాత్రులను వసంతనవరాత్రులు అని, నక్షత్రాలలో మొదటిది అయిన అశ్విని ప్రధానంగా ఉండే ఆశ్వీయుజమాసంలో నవరాత్రులను శరన్నవరాత్రులు అని,  రెండుమార్లు నవరాత్రులను జరుపుకుంటాము. ఒకటి ఉత్తరాయణంలో ...... మరొకటి దక్షిణాయనంలో రావటం మరొక విశేషం.
మరో విశేషం కూడా ఉంది. చైత్రమాసపు నవరాత్రులు అశ్వినీ నక్షత్రంతో ప్రారంభమైతే, అశ్వినీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండే ఆశ్వీయుజమాసపు నవరాత్రులు చిత్తా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మరొక విశేషం ఏమిటంటే ...... నక్షత్రాలు 27 లో మొదటిది అశ్విని అయితే సరిగ్గా మధ్యగా వుండే నక్షత్రం చిత్త. అలాగే మాసాల్లో 12 లో మధ్యగా వుండే మాసం ఆశ్వీయుజం. ఆరింటిలో మొదటిది చైత్రమాసం అయితే..... మధ్యగా ఉండే మాసం ఆశ్వీయుజం...... అదే విధంగా ఋతువులలో మొదటిది వసంతమైతే ... మధ్యది శరదృతువు.
ఇది అంతా ఎందుకు అంటే... అమ్మవారు ఆదిలోనూ, మధ్యలోనూ కూడా పూజింపబడే విధంగా ఏర్పాటుచేసుకొని మనల్ని అనుగ్రహించాలి అనే కరుణాబుద్ధి కలిగి ఉంది అని తెలియచేయటానికే. తిథులు 30 లో కూడా పూర్ణిమ వరకు పూజింపబడేది అమ్మ (ఆదిశక్తి) యే. (ప్రతిన్ముఖ రాకాంత తిథి మండల పూజితా).
ఇలా ఆయన -- ఋతువు -- మాస --- పక్ష --- తిథులలో రెండుమార్లు పూజింపబడుతూ తొమ్మిదిరోజులపాటు మరి ఏ ఇతర దైవానికీ పూజలు జరగనేజరుగవు.
         యోగం అనేది మొత్తం కుండలినీశక్తికి సంబంధించి ఉంటుంది. "కుండలినీ" అనే శబ్దం సంస్కృతంలో స్త్రీలింగం. కాబట్టి ఈ కుండలినీ శక్తినీ సాధించదలచి యోగాన్ని ప్రారంభించిన వ్యక్తికి కలిగే అనుభవాలన్నిటినీ క్రమంగా ఒక స్త్రీలో కలిగే మార్పులుగా వర్ణించి చెప్పారు మన (పూర్వీకులు) పెద్దలు.
ఆ కారణంగా అమ్మవారి తొమ్మిది అవతారాల్లో సాధకునికి క్రమక్రమంగా జరిగే అభివృద్ధి తొమ్మిదిదశల్లో ఉంటుందని ప్రాచీనులు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ తొమ్మిది దశలు దాటిన సాధకుడు "దశ" అవస్థనాటికి విజయాన్ని సాధించి సిద్ధినిపొంది సిద్ధుడౌతాడు. ఆ సిద్ధినే "విజయ(దశమి)సిద్ధి"  అంటారు.
నవరాత్రులలో ప్రతిరోజూ దేవికి వేసిన ఒక్కొక్క అవతారాన్ని(ఒక్కొక్క అలంకారాన్ని) సాధన చేసే సాధకుని ఒక్కొక్క మెట్టు అభివృద్ధుగా గమనించాలని మనం భావించాలి. ప్రతిరోజూ అమ్మవారి అలంకారాన్ని చూసి రావాలనే నియమాన్ని విధించింది  కూడా ఇందుకే..... సాధకుని ప్రతీ దశలోనూ అభివృద్ధిని గమనిస్తూ ఉండాలనే రహస్యాన్ని అర్థమయ్యేలా చెప్పటానికే ఇవన్నీను.


Curtesy: Mani, vizag

Sunday, 16 October 2016

వ్యాకరణంలో

వ్యాకరణంలో సంబాషణ!
.
ఈ కథ చాలా పాతకాలందిలెండి.!
ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన బండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి బండి లో కూర్చో బెట్టి బయల్దేరాడు . త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో .
పోరుగూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.
దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ
మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?అన్నాడు నవ్వుతూ
షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండిఅనే అర్థము వస్తుంది
కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.
(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?)
ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి.
(అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు.
యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.
....
ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.
ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.శిష్యుడు అతడి భార్య
ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.అప్పుడు గురువు
ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.
అప్పుడు శిష్యుడు నవ్వుతూ గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి
వెళ్ళుట మీకు న్యాయమేనా?అన్నాడు. గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే
నీకు యేమీ అపకారము చెయ్యదు.పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.పంచమీ తత్పురుషము
లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.
పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము' షష్టీ తత్పురుషము నకు
ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు.
ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు.
అందుకు గురువు గారు నవ్వుతూ
నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.ద్వంద్వా తీతుడంటే
మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.

Thursday, 6 October 2016

మంచి కధ.. చదవండి..!!

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది. 
ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. 
ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో⚡బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.
ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు."చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.... 
ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు"నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై...అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.
కాని, ఆ పుణ్యఫలం 
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు! 
🔸పిల్లలది కావచ్చు! 
🔸తోబుట్టువులది కావచ్చు! 
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా 
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. 
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.
ఒక సినిమాలో చెప్పినట్లు..."బాగుండడం" అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.
ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము🙏.

కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము🙏.

curtesy: Mani, vizag

Thursday, 29 September 2016

మన భాషాకారుల గొప్పతనమిది

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః

శ్రీఃయాదవం భవ్యభతోయ దేవం
సంహారదాముక్తిముతాసుభూత

పై శ్లోకాలలో మొదటిది శ్రీరాముడి గురించి, రెండవది శ్రీక్రిెష్ణుని గురించి. ప్రత్యేకత ఏమిటంటే.. మొదటి శ్లోకాన్ని వెనక నుంచి చదివితే రెండవ శ్లోకం అవుతుంది రెండవ శ్లోకాన్ని వెనుక నుంచి చదివితే మొదటి శ్లోకం అవుతుంది. మన భాషాకారుల గొప్పతనమిది

curtesy: vasamta prasad VJA

Wednesday, 28 September 2016

చిదంబర క్షేత్రములో రహస్యాలు

తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ , అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు.
కానీ అందరినీ అత్యంత ఆశ్చర్య చకితుల్ని చేసే ఎన్నో గొప్ప విశేషాలు
ఈ ఆలయమునకు సంబంధించి ఉన్నాయి. అవి ఏమిటో ఒక్కసారి చదవండి.
చిదంబర రహస్యం !
( ఆలయం ఒక అద్భుతం )
.
చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు,
భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల
పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .
ఈ విషయాన్ని తన గ్రంధం " తిరుమందిరం " లో
ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు.
.
ఇపుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం !
.
ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది
.
" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు .
అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......!
ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి .
అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి .
ఇది ఆశ్చర్యం కదూ !
.
చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి
.
చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 )
.
ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .
..
దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి .
అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.
" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు
.
పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు
.
9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు .
అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .
ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు
..
నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు .
మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

Friday, 9 September 2016

విజయవాడ రైల్వే ప్రయాణికులకు గమనిక

విజయవాడ రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక
వారం రోజుల పాటు విజయవాడ కు వచ్చే రైళ్లను నిలిపివేయబోతున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో తీసుకురాబోతున్న ఆదునీకరణ పనుల రీత్యా ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది.ఆ వారం రోజుల పాటు విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లు పాక్షికంగా రద్దవుతాయి. మరో 215 రైళ్లను దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సైతం ఆగిపోతాయి. అందువల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకోవాలని రైల్వే అదికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్-హౌరా మధ్య రాకపోకలు సాగించే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవు. ఈ ట్రైన్‌లను ఏలూరు, విజయవాడ బైపాస్ రాయనపాడు కొండపల్లి స్టేషన్‌ల మీదుగా నడుపుతారు.
ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ భువనగిరి, రాయగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్‌ల మీదుగా తిరుపతికి రాకపోకలు సాగిస్తుంది.
ముంబై సీఎస్‌టీ-భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ సేవలు విజయవాడ, కాజీపేట్ మార్గంలో నిలిచిపోనున్నాయి. కొండపల్లి-విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా మళ్లిస్తారు. ఇలా వివిధ రైళ్లను దారి మళ్ళి స్తారు.

Monday, 22 August 2016

మహాభారతం లో భీష్ముడు (శాంతి పర్వము)

21/08/2016 తేదీన జరిగిన బ్రహమశ్రీ చాగంటి వారి ప్రసంగములో భీష్ముడు ధర్మజునితో రాజా సంకల్పముల వలన కామము(కోర్కెలు) కలుగుతాయి. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. ధర్మ బద్ధమా అధర్మమా, ఇది మంచిదా చెడుదా అని చూడకుండా ప్రతిపాదిస్తూ ఉంటుంది. మనిషి వీటిలో దేనిమీద అయినా అనురక్తుడయ్యడనుకోండి, మనస్సు ఈ శరీరాన్ని పట్టుకుని తన కోరిక తీర్చుకుంటుంది. మనిషిని అఢః పాతాళానికి తోశేస్తుంది. అందుకని మనసుపై అజమాయిషీ కలిగి ఉండు. అది సాధన వలన మాత్రమే కలుగుతుంది. మనసు ప్రీతితో కానీ అప్రీతితో కాని మాట వింటుంది. ఒక రోజు ఒక మంచి పని చేద్దామని అనిపిఉంచగానే మనసు ముందు ఆ పనిలో ఉన్న కష్టాలని చెబుతుంది. దాని మాట వినకుండా మీరు మీ ప్రతిపాదనకే మొగ్గు చూపారనుకోండి అది యేమీ అనదు. మరునాడు అంటే.. అలా నాలుగు రోజులు మంచి పని వైపు మీరు జరిగితే  అయిదవనాడు మనస్సే ఇంకా బయలుదేరలేఅదేమిటి. ఆ మంచి పని చెయ్యాలి అని చెబుతుంది. ఇది సాధనతో మాత్రమే వీలవుతుంది. అని మనస్సు నియంత్రించుకోవడం ఎలా అన్న విషయం మీద ఎన్నో ఉదాహరణలతో చక్కగా వివరించారు.
   మనిషికి కోపము ఎందుకు వస్తుంది. దానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తన కోరిక తీరకపోతే కారణం వెతికి కోరిక తీరకపోవడానికి కారణమైన దాని మీద కోపము పెంచుకుంటుంది. రెండవది ఇతరులు యేది తప్పు చేశారు అన్న భావన. మనసు క్రోధానికి వశపడ కుండా ఉండాలంటే మనిషి ఓర్పు అలవరచుకోవాలి అది ఎలా సాధించాలి అన్నది భీష్ముడు చెప్పగా వ్యాసుడు వ్రాయగా తిక్కన తెనిగించగా పూజ్వ గురువులు నాలాంటి వారికి అర్ధమయ్యే రీతిలో చక్కగా చెప్పారు. తదుపరి భీష్ముడు ధర్మజునితొ చెప్పిన్ నాడీ ఝంభుని వృత్తాంతము, హంసగీతి కూడా చెప్పారు. ఇది విన్నంత సేపూ ఆహా ఓహో అని పిస్తుంది అర్ధమైన దానిలా కనపడుతుంది. తీరా ప్రసంగం అయిపోయి ఇంటికి బయలుదేరగానే ఈ రోజు ఏమి చెప్పారు అని ఆలోచిస్తే....... ఏదీ జ్ఞాపకం రాదు. 

Saturday, 20 August 2016

భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మములు చెప్పుట

05/2016 నుండి మహభారతంలో వివిధ పాత్రలు అనే శీర్షిక క్రింద బ్రహ్మశ్రీ చాగంటి కోతేశ్వరరావు గారు చేస్తున్న ప్రవచన కార్యక్రమము లో భీష్మాచార్యులవారి గురించి వారు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకి ధర్మ సూక్ష్మములు చెపుతున్న (శాంతి పర్వము) సంఘటన జరుగుతోంది. భీష్మ పితామహులు ధర్మరాజుతో ఆశ్రమ ధర్మాలు చెబుతున్నారు. 1. బ్రహ్మచర్యాశ్రమము, 2. గృహస్తాశ్రమము, 3.వానప్రస్థాశ్రమము, 4. సన్యాశాశ్రమము. ఈ నాలుగు ఆశ్రమములలోను అత్యంత ఉత్తమమైన ఆశ్రమము గృహస్తాశ్రమము. మిగిలిన మూడు ఆస్రమములు ఈ గృహస్తాశ్రమముని ఆశ్రయించే ఉంటాయి. గృహస్తు విత్తము ఆర్జించి, ఆ ధనాన్ని 5భాగములు చేసి 1భాగము ధర్మముకొరకు, రెండవభాగము కీర్తికొరకు, మూడవది లోకిక వ్యవహారముల కొఱకు, నాలగవ భాగము తన కొరకు అంటే తన జీవుని ఉధరణ కొరకు, అయిదవ భాగము స్వజనుల కొరకు.  
  భీష్ముడు ధర్మరాజుతో రాజా ఇవన్నీ ఎవరి వలన వృద్ధి చెందుతాయో తెలుసా.. అవి రాజు వలననే వృద్ధి చెందుతాయి. అని రాజుకు ఉండవలసిన గుణములు చెబుతాడు.

అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడు శాంతి పర్వము

అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వద్దకు ధర్మ సూక్ష్మాలను తెలుసు కోవడానికి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా వచ్చాడు. భీష్ముడు రాజు ఎలా ఉండాలి రాజు వద్ద ఉండే కార్య నిర్వాహకులు ఎలా ఉండాలి, రాజ్యంలో ప్రజలు ఎలా ఉండాలి, అందునా గృహస్తు ఎలా ఉండాలి అనేవి నేటి వరకూ  పూజ్వ గురువుల ప్రసంగంలో చెప్పారు. అనివార్య కారణాల వలన నేను ప్రవచనం వినలేక పోవడం వలన ప్రసంగ పాఠాన్ని టూకీగా చెప్పాను.  

Monday, 15 August 2016

కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం ఎందుకు పట్టుకున్నారు.

కురుక్షేత్ర యుద్ధము మోదలైన తరువాత రెండవ రోజు యుద్ధములో పాండవులు అత్యుత్సాహముతో యుద్ధం చేస్తున్నారు. సమయములో వారికి దుర్యోధనుడు కనపడ్డాడు. అతణ్ణి చూడగానే భీముడు అరివీర భయంకరుడిలా విరుచుకు పడ్డాడు. దుర్యోధనుడి ఆయుధాలని విరిచెయ్యడమే కాకుండా అతడు స్పృహ కోల్పోయేటట్లు చేశారు. అప్పుడు సారధి రధిని రక్షించుకోవడానికి రధాన్ని యుద్ధభూమి నుండి తప్పించాడు. ఆరోజు యుద్ధం పూర్తి అయింది. ఆనాటి రాత్రి దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని ఉద్దేసించి మాట్లాడుతూ మీరు పాండవ పక్షపాతులు అందుకే వారు విజౄంభిస్తుంటే మిన్నకుండి పోయారు. కనీసం రాజైన నన్ను రక్షించలేని స్థితిలో ఉన్నారు…  మిమ్ములను నమ్ముకుని నేను యుద్ధానికి వచ్చాను. మీగురించి ముందే తెలిస్తే నా స్నేహితుడైన కర్ణుణ్ణి సైన్యాధ్యక్షుణ్ణి చేసేవాడిని అని తాతగారు అని కూడా చూడకుండా అనరాని మాటలు అన్నాడు. భిష్మాచార్యులవారు తాను సైన్యాద్యక్ష పదవి చేపట్టకముందు చెప్పిన షరతులు దుర్యోధనుడికి గుర్తు చేశారు. అయినప్పటికీ దుర్యోధనుడు భీష్మాచార్యులవారిని అనరాని మాటలు అన్నాడుఅతని మాటలకి ప్రత్యుత్తరముగా రేపు నా యుద్ధ పాటవాన్ని చూద్దువుగాని అన్నారు.

 మరునాటి యుద్ధములో భీష్మాచార్యులవారి విఝృంభణకి పాండవ సైన్యం అంతా కకావికలమై పోయింది. ఎవ్వరూ భీష్మునికి ఎదురు నిలబడలేక పోయారు. అర్జనుణ్ణి విపరీతంగా నొప్పించి అతని శరీరమంతా నెత్తురు కారేటట్లు చేసారు. తన చెలికాడు, తన భక్తుడు,ధర్మ దీక్షా పరుడు, తాను రధ సారధ్యం చేస్తుండగా ఇలాంటి అవస్థా అని తలచి  అర్జనుడు అచేతనుడై పోయి ఉన్న స్థితిని గమనించిన కృష్ణపరమాత్మ పగ్గాలని రధపు నొసలుకి కట్టి ఒక్క ఉదుటని దూకాడు. అతని ధాటికి భూమి కంపించింది. సుదర్శనాన్ని స్మరించి దానిని ధరించి  భీష్ముని వైపు కదిలాడుసుదర్శన చక్రపు కాంతులు కురుక్షేత్ర యుద్ధభూమిని కమ్మేశాయి. అంటే భీష్ముడు యుద్ధాన్ని ఆపడానికి అడ్డుకోవడానికి భగవంతుడే దిగి రావలసి వచ్చింది. దుర్యోధనుడికి విషయం అర్ధమవ్వాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం ధరించాడు. ఇదీ అసలు ధర్మ సూక్ష్మము. అంతేకాని అర్జనుడు చేతకాని వాడైతే కృష్ణుడు ఆయుధం పట్టలేదు. ఇది మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన రహస్యంఈ ఘట్టాన్ని బ్రహ్మశ్రీ చాగంటి వారు వర్ణించి చెప్పిన పద్ధతి సభికుల అందరి గుండెల్లో నిలిచి పోయింది. మహాభారతంలో పాత్రలు శీర్షికన జరుగుతున్న ప్రవచనాలు తిరిగి మళ్ళీ 16వ తేదీన అని ప్రకటించి ఉన్నారు.

Saturday, 13 August 2016

భీష్మాచార్యులవారి యుద్ధ నిపుణత

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారి నేటి ప్రవచనం(11/08/2016 )  అత్యంత రమణీయముగా జరిగిందికురుక్షేత్ర సంగ్రామములో భీష్మాచార్యులవారి యుద్ధ నిపుణత కౌశలము 3వనాటి యుద్ధములో అరివీర భయంకరుడై చెలరేగి చేసిన యుద్ధము, దానిని చూసి కృష్ణుడు సుదర్శన చక్రధారి యై భీష్ముని సమ్హరిస్తాను అని రధము పై నుండి దూకి వెళ్తుంటే అర్జనుడు పరుగు పరుగున వచ్చి కృష్ణుని ప్రాధేయపడి వెనక్కి తీసుకు రావడం బహు రమణీయముగా ప్రవచించినారు.

 ఇక్కడ ఒక సందేహము. అర్జనుడు యుద్ధము పూర్తి సామర్ధ్యాలతో చెయ్యలేక పోయాడా?... ఆయుధం పట్టను అని చెప్పిన కృష్ణుడు ఆయుధం పట్టడం ధర్మ విరుద్ధం కాదా??.. అసలు వీటి వెనుక యేమైనా ఉందా.. ఉంటే సూక్ష్మ రహస్యము యేమిటి?

Wednesday, 27 July 2016

అంత్యపుష్కర ఆహ్వానపత్రిక

                                   
  అంత్యపుష్కర ఆహ్వానపత్రిక


శ్రీరస్తు                                                      శుభమస్తు                              అవిఘ్నమస్తు


పవిత్ర గోదావరి నది అంత్యపుష్కరాల సందర్భముగా బంధువులందరికీస్నేహితులకివారి వారి బంధువులు స్నేహితులకి ఇదే మా ఆహ్వానము.
               అంత్యపుష్కర సందర్భముగా పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి తదితర పూజ కార్యక్రమములను నిర్వహించుకోవలెను. కనుక మీరు అందరూ జూలై 31 నుండి ఆగస్టు 11 వ తారీఖు వరకూ ఇక్కడ ఉండే విధముగా మీరు వచ్చి పవిత్ర స్నానములను ఆచరించి మీరు పుణ్యము గైకొని మీకు ఆతిధ్యమిచ్చిన మమ్ములను ఆనందింపచేసి తరింప చేయగోర్తాము.
            మీరు అందరూ తప్పక విచ్చేసి మా ఆతిధ్యము స్వీకరించి మమ్ములను ఆనందింపచేయగోర్తాము.
                                                                                                            ఇట్లు

                                                                                                   ప్రభాకరరావులలిత